- ఫిలిప్పీన్స్‌లో ఇండియన్ ఎంబసీని సందర్శించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆర్.భూపతిరెడ్డి తెలిపారు. ఈ పాలసీ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం సభ్యులు బుధవారం ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాలోని ఇండియన్ ఎంబసీని సందర్శించారు.
ఆ తర్వాత మనీలాలోని కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ ఉన్నతాధికారులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ వలస విధానాన్ని ఎంబసీల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిలిప్పీన్స్ దేశ వలస విధానాన్ని ఆ దేశ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వలస విధానాన్ని అమలు చేస్తున్న ఫిలిప్పీన్స్‌లో ఉన్న విధి విధానాలను క్షుణ్నంగా పరిశీలించి, ఇదే తరహా మెరుగైన వలస విధానాన్ని గల్ఫ్ కార్మికుల కోసం అమలు చేసేందుకు కృషి చేస్తామని విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెల్లడించారు.
మనీలాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ హర్ష కుమార్ జైన్, ఫస్ట్ సెక్రటరీ నీలేశ్ కుమార్ రాయ్‌తో వలస కార్మికుల విధానాల అంశాలపై కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. గల్ఫ్ కార్మికులను సంక్షేమం కోసం ఫిలిప్పీన్స్ తరహా విధానాలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఫిలిప్పీన్స్‌లో పర్యటిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, ప్రొఫెసర్లు విజయ్ కొర్ర, శ్రీనివాస్ పాల్గొన్నారు.
